Amazon: అమెజాన్‌లో మొదలైన మలివిడత లేఆఫ్స్

Amazon fires over 100 employees in the second round of layoffs
  • తాజాగా 100 మంది ఉద్యోగుల తొలగింపు
  • గేమింగ్, సంబంధిత విభాగాల్లో ఉద్యోగులపై ప్రభావం
  • మిగిలిన ఉద్యోగులకు అదనపు బాధ్యతల బదిలీ
  • ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిహారం, హెల్త్ ఇన్సూరెన్స్
అంతర్జాతీయ టెక్ దిగ్గజం అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపులు ప్రారంభమయ్యాయి. తొలివిడత లేఆఫ్స్‌లో పది వేల పైచిలుకు ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మలివిడత లేఆఫ్స్ చేపట్టబోతున్నట్టు గత నెలలోనే ప్రకటించింది. ఈమారు సుమారు 9 వేల మందికి ఉద్వాసన తప్పదని పేర్కొంది. ఈ దిశగా ఇటీవల వంద మందిని తొలగించింది. ఈ మేరకు ఆయా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించింది. 

ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, శాన్ డియోగోలో కంపెనీకి చెందిన ఓ స్టూడియోలో కొందరు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అయితే..వీరి బాధ్యతలను మిగిలిన ఉద్యోగులకు బదిలీ చేస్తున్నట్టు అమెజాన్ గేమ్స్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ హార్ట్‌మన్..ఉద్యోగులకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కష్టతరమైనదని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థకున్న ప్రస్తుత ప్రాజెక్టులు, దీర్ఘకాలిక లక్ష్యాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.  

ఉద్యోగం కోల్పోయిన వారితో త్వరలో ఓ మీటింగ్ నిర్వహించి తదుపరి న్యాయపరమైన కార్యాచరణపై చర్చిస్తామని క్రిస్టోఫర్ హార్ట్‌మన్ తెలిపారు. వారికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. ఆయా వ్యక్తులకు సంస్థ తరపు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, ఔట్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ తదితర సేవలు కూడా కొంతకాలం పాటు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
Amazon
Layoffs

More Telugu News