Puvvada Ajay Kumar: బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పువ్వాడ అజయ్
- టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ అరెస్ట్
- మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్న పువ్వాడ అజయ్
- బండి సంజయ్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్
పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం తెలంగాణలో పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంలో సంజయ్ కుట్ర ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలవడానికి ప్రజల మనసులను గెలుచుకోవాలే కానీ, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకేజీకి కుట్ర పన్నిన బండి సంజయ్ ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని పువ్వాడ అజయ్ అన్నారు. బండి సంజయ్ కు ఎంపీగా కొనసాగే నైతిక అర్హత లేదని... ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రలకు అమాయకులు బలికాకూడదని చెప్పారు.