Bandi Sanjay: టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
- టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఈ నెల 19 వరకు రిమాండ్
- కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంజయ్ తరపు లాయర్లు
- సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించే అవకాశం
తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మేజిస్ట్రేట్ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బండి సంజయ్ ను పోలీసులు ఏ1గా పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన పేపర్ లీకేజ్ కుట్రకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. మరోవైపు, సంజయ్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న జడ్జి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.
మరోవైపు, ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ సంజయ్ కు బెయిల్ రాకపోతే... ఆయనను ఖమ్మం జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, బండి సంజయ్ ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరబోతున్నట్టు తెలుస్తోంది. రేపు వారు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.