Sajjala Ramakrishna Reddy: రేపటి నుంచి 'జగనన్నే మా భవిష్యత్తు'... గృహసారథులు ఏంచేస్తారో చెప్పిన సజ్జల
- ఏప్రిల్ 7 నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
- ఇంటింటికీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు
- సన్నాహాలన్నీ పూర్తయ్యాయన్న సజ్జల
- ప్రజల మద్దతు తమకేనంటూ ధీమా
- మరే రాష్ట్రంలోనూ లేని విధంగా పాలన అందిస్తున్నట్టు వెల్లడి
ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రేపటి నుంచి నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు.
ఇది భారీ సర్వే కార్యక్రమం అని సజ్జల వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా పార్టీ గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గడపకు వెళతారని వెల్లడించారు. 1 కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తారని.... "మమ్మల్ని మా జగనన్న పంపారు. ఆయన తరఫు నుంచి మీ మద్దతును కోరుతున్నాం... మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం" అని ప్రజలతో మాట్లాడతారని వివరించారు.
అంతేకాదు, జగన్ ఇచ్చిన సందేశాన్ని కూడా ఆ కుటుంబానికి వివరిస్తారని తెలిపారు. ఏడు లక్షల మంది గృహసారథులు ఇందులో పాలుపంచుకుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని అడగ్గలిగిన సాహసం జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రమే చేస్తోందని అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులమతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, ఒక్క రూపాయి లంచం తీసుకోని విధంగా పథకాలను, సౌకర్యాలను అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని సజ్జల చెప్పుకొచ్చారు.
మా పథకాలతో మీ ఇళ్లలో మేలు జరిగిందని నమ్మితేనే మళ్లీ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని సీఎం జగన్ ఇటీవల సభల్లో ధైర్యంగా అడగ్గలుగుతున్నారంటే, తాము అమలు చేస్తున్న విధానాలే కారణమని తెలిపారు. ఈ ధైర్యం ప్రజలు ఇచ్చిందేనని, తమది పొగరు కాదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి సీఎం జగన్ కు సంపూర్ణ మద్దతు లభిస్తుందని తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా తమ ప్రతినిధులు ప్రతి ఇంటికి ఓ కరపత్రంతో వెళతారని, అందులో గత టీడీపీ పాలన ఎలా ఉంది, ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అనే వివరాలు ఉంటాయని వెల్లడించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబునాయుడు నేతృత్వంలో జలగల్లా ఎలా పీల్చేశారనేది కూడా ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు.
ఆ తర్వాత ప్రజా మద్దతు పుస్తకం అనే సర్వే బుక్ లెట్ ఉంటుందని, దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయని సజ్జల వివరించారు. తద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తామని, ఆ ఐదు ప్రశ్నల సమాధానాలే జగన్ కు మద్దతుపై స్పష్టత ఇస్తాయని తెలిపారు.
చివరిగా, జగనే మా నాయకుడు, ఆయనకే మా ఆశీస్సులు అని భావించినవారు గృహ సారథులు అందించే ఓ ఫోన్ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే మద్దతు తెలిపినట్టవుతుందని అన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు జగన్ సందేశం ఐవీఆర్ఎస్ పద్ధతిలో వినిపిస్తుందని సజ్జల వివరించారు.
ఇక, మీకు అభ్యంతరం లేకపోతే సీఎం జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ ను మీ ఇంటి తలుపుకు అంటిస్తామని గృహ సారథులు ఆయా కుటుంబాలను కోరతారు... దాంతో పాటే ఫోన్ కు అంటించే స్టిక్కర్లను కూడా ఇస్తారు అని వెల్లడించారు. ఇదంతా కూడా స్వచ్ఛందంగానే అని సజ్జల స్పష్టం చేశారు.