Mahatma Gandhi: 'ఆధునిక భారత మహాత్మాగాంధీ' అంటూ రాహుల్ పై కాంగ్రెస్ నేత ప్రశంసలు
- గాంధీ లక్షణాలు రాహుల్ లో ఎన్నో ఉన్నాయన్న అమితేశ్ శుక్లా
- ఒకరు జాతిపిత, మరొకరు జాతి పుత్రుడు అని వ్యాఖ్య
- ప్రధాని కావాలనుకుంటే ఇద్దరూ అయ్యేవారన్న శుక్లా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆ పార్టీ ఎమ్మెల్యే అమితేశ్ శుక్లా ఆధునిక భారత మహాత్మాగాంధీగా పోల్చారు. మహాత్మాగాంధీలో ఉన్న ఎన్నో లక్షణాలు రాహుల్ గాంధీలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆరోజుల్లో మహాత్మాగాంధీ దండి యాత్రను చేపడితే ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని కొనియాడారు. మహాత్మాగాంధీ జాతిపిత అయితే, రాహుల్ గాంధీ జాతిపుత్రుడు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తాను ఎంతో బాధ్యతగానే చేస్తున్నానని తెలిపారు.
తాను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందినవాడినని ఆయన చెప్పారు. మహాత్మాగాంధీ గురించి తాను తన తండ్రి శ్యామ్ చరణ్ శుక్లా (ఉమ్మడి మధ్యప్రదేశ్ మాజీ సీఎం) నుంచి చాలా తెలుసుకున్నానని చెప్పారు. మహాత్మాగాంధీకి, రాహుల్ గాంధీకి ఎన్నో పోలికలు ఉన్నాయని అన్నారు.
మహాత్మాగాంధీ కావాలనుకుంటే మన దేశ తొలి ప్రధాని అయ్యేవారని... అలాగే రాహుల్ గాంధీ కోరుకుని ఉంటే 2004, 2008లో ప్రధాని అయ్యేవారని చెప్పారు. గాంధీ మాదిరే రాహుల్ కూడా నిజాన్నే మాట్లాడతారని... అదానీ గురించి రాహుల్ అన్నీ నిజాలే చెప్పారని తెలిపారు.