Hyderabad: వర్షం, వడగళ్లతో తడిసి ముద్దయిన హైదరాబాద్ నగరం
- తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
- హైదరాబాదులో అనేక చోట్ల వర్షం
- పలు ప్రాంతాల్లో వడగళ్లు
హైదరాబాద్ నగరంలో ఈ మధ్యాహ్నం అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్న నగరజీవులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
సైదాబాద్, అంబర్ పేట, కాచిగూడ, ఉప్పల్, మల్లాపూర్, నల్లకుంట, లాలాపేట్, నాచారం, హబ్సిగూడ, గోషా మహల్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, సుల్తాన్ బజార్, రామ్ నగర్, గాంధీనగర్, ముషీరాబాద్, విద్యానగర్, దోమలగూడ, అడిక్ మెట్, చిలకలగూడ, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, ప్యారడైజ్, వారాసిగూడ, రామ్ గోపాలపేట, భన్సీలాల్ పేట, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వర్షం కారణంగా ఉప్పల్ వైపు వెళ్లే రహదారులు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉత్తరాది వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వివరించింది.