Cheetah: అధికారులకు చుక్కలు చూపిస్తున్న నమీబియా చీతాలు
- భారత్ లో చాలాకాలం కిందట అంతరించిపోయిన చీతాలు
- ఆఫ్రికా ఖండం నుంచి భారత్ కు చీతాల రాక
- మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో చీతాలకు ఆవాసం
- తరచుగా తప్పించుకుపోతున్న చీతాలు
భారత్ లో దశాబ్దాల కిందట అంతరించిపోయిన చీతాల జాతిని తిరిగి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి చీతాలను తీసుకురావడం తెలిసిందే. వీటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. ఇటీవల వీటిలోని ఆడ చీతా సాషా కిడ్నీ వ్యాధితో మరణించింది.
కాగా, ఈ నమీబియా చీతాలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇవి నిర్దేశిత ప్రాంతం దాటి బయటికి వెళ్లిపోతున్నాయి. దాంతో ఆ చీతాలను తిరిగి కునో నేషనల్ పార్క్ కు చేర్చే సరికి అధికారులకు తల ప్రాణం తోకకు వస్తోంది.
ఇటీవల ఒబాన్ అనే చీతా తప్పించుకుపోయింది. దాంతో అధికారులు తీవ్రంగా శ్రమించి దాన్ని తిరిగి తీసుకువచ్చారు. ఒబాన్ ను సురక్షితంగా తీసుకువచ్చేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.
తాజాగా ఆశా అనే మరో చీతా కునో నేషనల్ పార్క్ లోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వెళ్లిపోయింది. అది వీర్ పూర్ ప్రాంతంలోని బఫర్ జోన్ లో ఉన్నట్టు గుర్తించారు. ఆశా నదుల వెంట తిరుగాడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, చీతాల వల్ల మనుషులకు హాని ఉండదని చెబుతున్నారు.