Pawan Kalyan: నేను సాధారణంగా విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లను: వరంగల్ 'నిట్' వేడుకల్లో పవన్ కల్యాణ్
- వరంగల్ నిట్ లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు పవన్ హాజరు
- ఫెయిలైనా సరే చిట్టీలు పెట్టకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి
- నాడు ఇంటర్ ఫెయిలైనా నైతికంగా గెలిచానని వివరణ
వరంగల్ లోని జాతీయస్థాయి విద్యాసంస్థ ఎన్ఐటీ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సాధారణంగా విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లనని తెలిపారు. తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకుంటా అని విద్యార్థులకు తెలిపారు. బాల్యంలో లియొనార్డో డావిన్సి తన రోల్ మోడల్ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఇంటర్ పరీక్షల సమయంలో తన స్నేహితులు చిట్టీలు తీసుకెళ్లేవారని తెలిపారు. ఫెయిలైనా సరే కాపీ కొట్టకూడదని తాను భావించేవాడ్నని వివరించారు. తాను ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యానని, కానీ నైతికంగా విజయం సాధించానని పేర్కొన్నారు.
నెహ్రూ ఎంతో ముందుచూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని కీర్తించారు. మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరాజయాలు ఎదుర్కొంటేనే విజయాలు సాధ్యమని పేర్కొన్నారు. ఇవాళ నేను విఫలం కావొచ్చు... రేపు విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.
కళ ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనందరినీ కలిపేది సంస్కృతి ఒక్కటేనని పేర్కొన్నారు. మానవత్వం అనేది మనుషులను ఏకం చేస్తుందని తెలిపారు. నాటు నాటు పాటకు ప్రాంతాలకు అతీతంగా పాదం కదిపారని వివరించారు.