Kishan Reddy: పోలీసు వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసిన రాష్ట్రం మరొకటిలేదు: కిషన్ రెడ్డి
- తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్
- బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈటల రాజేందర్ కు నోటీసులు
- వాట్సాప్ లో మెసేజ్ వస్తే నోటీసులేంటన్న కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్, తదితర పరిణామాలపై స్పందించారు. బండి సంజయ్ అరెస్ట్ అక్రమం అని ఖండించారు. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని కిషన్ రెడ్డి విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఈ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
ఇక, వాట్సాప్ లో మెసేజ్ వస్తే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు పంపడం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టు ప్రశాంత్ ఎంతోమందికి క్వశ్చన్ పేపర్ మెసేజ్ పంపించాడని, జర్నలిస్టులు తమకు వచ్చిన సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో వాట్సాప్ మెసేజులు పంపుతుంటారని, ఇది సాధారణమైన విషయం అని కిషన్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. జర్నలిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.