Balakrishna: ఆయనకు మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా కూడా తెలియదు: బాలకృష్ణ
- సలహాదారుల మాట కూడా జగన్ వినడన్న బాలకృష్ణ
- వైసీపీలో బబుల్ బద్దలవుతుందని వ్యాఖ్య
- రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని ఎద్దేవా
ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని బాలయ్య విమర్శించారు. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా తీసుకురాలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసి వైసీపీని గెలిపించారని... ముఖ్యమంత్రి బాదుడే బాదుడికి గురి కాని వ్యక్తి ఒకరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్ కు పాలించడం చేత కాదని... సలహాదారులను పెట్టుకున్నా, వారి మాటను వినడని విమర్శించారు. సలహాదారులు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారని చెప్పారు. తమ మాటను జగన్ వినకపోతుండటంతో సలహాదారులంతా జీతాలు తీసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేశ్ పాదయాత్రను ఎందుకు చేపట్టారో దాని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, దాని ఫలితాన్ని మీరంతా స్వీకరించాలని బాలయ్య అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పుడు మీలో ఉన్న ఈ ఆవేశం ఆయన మీ జిల్లా దాటిపోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి చెంపపెట్టని అన్నారు. వైసీపీ నేతలలో కూడా అసంతృప్తి ఉందని, ఆ పార్టీలో బబుల్ బద్దలవుతుందని చెప్పారు. ప్రజాసేవ చేయాలని కొంతమంది వైసీపీ నేతలకు ఉన్నప్పటికీ ఆయన చేయనివ్వరుగా అంటూ జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని బాలయ్య చెప్పారు. మద్యం, డ్రగ్స్ ను యువతలోకి పంపి వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కు మనుషులంటే అలర్జీ అని అన్నారు. ఓటు మాత్రమే మీకు రక్ష అని, ఓటును సరైన నాయకుడికి వేయాలని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ వచ్చే శుభసూచకాలు చాలా కనిపిస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని చెప్పారు.