Elon Musk: ట్విట్టర్ లోగోలో మళ్లీ మార్పు

Little birdie is back Elon Musk replaces Dogecoin logo with official Twitter logo

  • డోజి స్థానంలో మళ్లీ బ్లూ పిట్ట
  • మూడు రోజుల పాటు కొనసాగిన కుక్క లోగో
  • మస్క్ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాని వైనం

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ప్లాట్ ఫామ్ ను తరచూ ప్రచారంలో ఉంచే చర్యలను అనుసరిస్తున్నారు. లేదంటే ఆరంభం నుంచి ట్విట్టర్ లోగో కింద ఉన్న పక్షి ఇమేజ్ ను మార్చి.. డోజికాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మను ఎందుకు పెట్టినట్టు..? డోజికాయిన్ అనే క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టబడులు ఉన్నాయని, డోజికాయిన్ విలువను పెంచేందుకే ఇలా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. 

మస్క్ మూడు రోజుల తర్వాత మళ్లీ పాత పిట్టను తీసుకొచ్చి ట్విట్టర్ లోగోలో పెట్టేశారు. దీంతో కుక్క బొమ్మ కనుమరుగైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతేడాది డోజికాయిన్ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా 258 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ మన్ హటన్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. డోజికాయిన్ ధరను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత పతనానికి కారణమయ్యారన్నది ఇన్వెస్టర్ల ఆరోపణ. 

సరిగ్గా మూడు రోజుల క్రితం ట్విట్టర్ పిట్టను తొలగించి, దాని స్థానంలో డోజిని కూర్చోబెట్టి ఎలాన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏదో కొన్ని నిమిషాల పాటు అలా జరిగి ఉంటుందేమో అనుకోగా, మూడు రోజుల పాటు డోజికాయిన్ లోగోనే ట్విట్టర్ లో కొనసాగించారు. అయితే, మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసి, దాని లోగోని డోజ్ తో మార్చాలంటూ లోగడ ఓ ఇన్వెస్టర్ ట్విట్టర్ లో సూచించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నాటి సూచనను మస్క్ అమలు చేసి చూపించినట్టయింది.

  • Loading...

More Telugu News