India: స్టెల్త్ యుద్ధ విమానంపై కన్నేసిన భారత్
- ఐదో తరం యుద్ధ విమానం కోసం భారత్ ఎదురుచూపులు
- త్వరలో కేంద్ర క్యాబినెట్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు
- అంచనా వ్యయం రూ.15 వేల కోట్లు
- 2035 నాటికి భారత్ అమ్ములపొదిలో స్టెల్త్ యుద్ధ విమానం
స్టెల్త్ పరిజ్ఞానం... గగనతల యుద్ధ రంగంలో విప్లవాత్మకం అని చెప్పవచ్చు. స్టెల్త్ వ్యవస్థలు కలిగివున్న యుద్ధ విమానాలు రాడార్లకు దొరక్కుండా దూసుకుపోతాయి. స్టెల్త్ యుద్ధ విమానం తమ గగనతలం నుంచి వెళ్లిన విషయాన్ని కూడా ప్రత్యర్థి దేశాలు గుర్తించలేవు.
అయితే, ఇప్పటిదాకా ఈ తరహా అత్యాధునిక యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఎఫ్-35, ఎఫ్/ఏ-22 రాఫ్టర్స్ (అమెరికా)... సుఖోయ్-57 (రష్యా), చెంగ్డు జే-20 (చైనా) విమానాలు ఐదో తరం పోరాట విమానాలు. వీటిలో మరింత అభివృద్ధిపరిచిన స్టెల్త్ టెక్నాలజీ వినియోగించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో అమెరికాకు చెందిన రెండు ఎఫ్-35 ఫైటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ క్రమంలో స్టెల్త్ యుద్ధ విమానాలపై భారత్ కూడా దృష్టి సారించింది. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ కోసం భారత్ ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. ఖరీదైన ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వాల నుంచి ఆమోదం అంత తేలిక కాదు. కాగా, భారత్ రూపొందించే స్టెల్త్ విమానాన్ని అడ్వాన్స్ డ్ మీడియా కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ)గా పిలవనున్నారు. రూ.15 వేల కోట్ల వ్యయంతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
త్వరలోనే ఈ ప్రాజెక్టు తుది ప్రతిపాదనలను ప్రధాని మోదీ నాయకత్వంలోని క్యాబినెట్ కమిటీ ముందుంచనున్నారు. ఈ స్వదేశీ రెండు ఇంజిన్ల యుద్ధ విమానం కార్యరూపం దాల్చితే, భారత్ స్టెల్త్ యుద్ధ విమానాలు కలిగిన నాలుగో దేశం అవుతుంది. 2035 నాటికి ఇది సాకారం అవుతుందని భావిస్తున్నారు.