Nara Lokesh: జగన్ ను ఎందుకు నమ్మాలి... ఏం చెప్పాలి?: లోకేశ్
- నేడు లోకేశ్ పాదయాత్రకు 63వ రోజు
- మార్తాడు శివార్లలో క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర షురూ
- లోకేశ్ తో కలిసి నడిచిన నందమూరి బాలకృష్ణ
- 800 కిమీ దాటిన లోకేశ్ పాదయాత్ర
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 63వ రోజు పాదయాత్ర మార్తాడు శివార్లలోని క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ యువనేతతో కలిసి అడుగులు వేయడం నేటి యువగళంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలయ్యను చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.
పాదయాత్ర 800 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. ఇచ్చిన హామీకి గుర్తుగా ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ గంజాయి వద్దు బ్రో అంటూ ప్రత్యేకమైన టోపీలు ధరించి వినూత్నంగా సందేశమిచ్చారు.
గార్లదిన్నె సభలో లోకేశ్ మాటల తూటాలు...
- నిన్ను జనం ఎందుకు నమ్మాలి జగన్? యువతను గంజాయి బానిసలు చేసినందుకా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచినందుకా?
- తల్లి, చెల్లెళ్లకే నీపై నమ్మకం లేదు... రాష్ట్రానికి ఏం సాధించారని మిమ్మల్ని నమ్మాలి?
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4స్థానాల్లో జనం కొట్టిన దెబ్బకు జగన్ కు మైండ్ బ్లాంక్ అయింది... దెబ్బకి దెయ్యం దిగొచ్చింది... ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
- వాలంటీర్ వాసు, గృహ సారథులు ప్రజల ఇళ్లకు వెళ్లి జగన్ డప్పు కొట్టాలట. నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం అని మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అంట. అందులో మొదటిది నువ్వే మా నమ్మకం కార్యక్రమం. సొంత కుటుంబ సభ్యులే నమ్మని జగన్ ని జనం ఎందుకు నమ్మాలి?
- వాలంటీర్ వాసు స్టిక్కర్ అతికిస్తే... ఆ స్టిక్కర్ పీకి సొంత కుటుంబమే నమ్మని జగన్ ని మేము ఎందుకు నమ్మాలి? అని ప్రశ్నించండి.
- రెండో కార్యక్రమం మా భవిష్యత్తు నువ్వే. రాష్ట్రం భవిష్యత్తు నాశనం చేసిన వాడు ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తాడు? గంజాయి అమ్ముతూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న వ్యక్తి మీ భవిష్యత్తు ఎలా అవుతాడు? అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసిన జగన్ మీ భవిష్యత్తు ఎలా అవుతాడు? వాలంటీర్ వాసు స్టిక్కర్ అతికిస్తే... ఆ స్టిక్కర్ పీకి జగన్ మాకు పట్టిన దరిద్రం అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
- ఇక మూడోది... జగన్ కి చెబుదాం?... ఏం చెప్పాలి? ప్రత్యేక హోదా గురించి చెబుదామా? పోలవరం గురించి చెబుదామా? విశాఖ రైల్వే జోన్ గురించి చెబుదామా? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెబుదామా? పెంచేసిన పన్నుల గురించి చెబుదామా? చెత్త పాలన గురించి ఏం చెబుతాం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- శింగనమలకు 8మంది ఎమ్మెల్యేలు!... శింగనమల ఎమ్మెల్యే పేరు జొన్నలగడ్డ పద్మావతి. ఈవిడ ఎమ్మెల్యే అయితే ఇక్కడ దళితులకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈమె పాలనలో దళితులకు అన్యాయమే జరిగింది.
- ఆమె చాలా బిజీగా ఉంటారు. వారంలో 5 రోజులు బెంగుళూరు, 2 రోజులు అనంతపురంలో ఉంటారు. ప్రజా సమస్యలు ఆమెకు పట్టవు. పేరుకే పద్మావతి ఎమ్మెల్యే పెత్తనం అంతా ఆమె భర్త సాంబశివారెడ్డిదే.
- ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను మీ నియోజకవర్గం బ్రేక్ చేసింది. మీకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు. పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి, ఇంకో ఆరుగురు బంధువులు.
- సాంబశివారెడ్డి శింగనమలను కేక్ లా కట్ చేసి కుటుంబసభ్యులకు పంచేసారు. శింగనమల - శ్రీరాంరెడ్డి, గార్లదిన్నె - నరేందర్‌రెడ్డి, బుక్కరాయసముద్రం - రమణారెడ్డి, నార్పల - రఘునాథరెడ్డి, పుట్లూరు - రాఘవరెడ్డి, యల్లనూరు - ప్రతాప్‌రెడ్డి. వీళ్లంతా ప్రభుత్వ భూములు, వివాదాలు ఉన్న భూములను కొట్టేస్తున్నారు. సుమారుగా 500 ఎకరాలు లేపేసి వాటాలు వేసుకొని పంచేసుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక
- 2005లో హత్యకు గురైన తండ్రి
- ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని ఉన్నత శిఖరాలకు!
- లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక
- సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేశ్
తమ కుటుంబాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లాయని చెప్పి, కృతజ్ఞతలు చెప్పేందుకు మిమ్మల్ని కలిశానని మౌనిక లోకేశ్ కు వివరించింది. యువతి చెప్పిన మాటలకు నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, పదిమందికి దారిచూపేలా ఆలోచించాలని సూచించారు.
అనంతపురంజిల్లా, బుక్కరాయసముద్రం మండలం, కేకే అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను ప్రత్యర్థులు 2005లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు నాగమణి, నాల్గవ కూతురు మౌనికను తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించారు. నాగమణి, మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకున్నారు. ఉన్నత విద్యను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సహకారంతో పూర్తిచేశారు.
నాగమణి ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకుని హైదరాబాద్ లోని వివిడ్ మైండ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి నేడు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. వీళ్ల బాబయ్ కొడుకు వెంకటేష్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి బెంగళూరులోని క్రిక్ బజ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ స్థిరపడ్డారు.
మూగ మనసుకి మాట వచ్చింది!
ఓ చిన్నారి మూగమనసుకి మాట వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి తన చికిత్సకి సాయం అందించిన చంద్రబాబు తనయుడికి ఆ చిన్నారి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మాటవచ్చిన ఆ మూగమనసు పేరు పవన్. తండ్రి పేరు బర్మా రమేష్. సింగనమల నియోజకవర్గం, గార్లదిన్నె మండలం, బనకచెర్ల ప్రాజెక్టు వద్ద నివాసం. కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రమేష్. మూడేళ్ల కొడుకు పవన్‌కి పుట్టుకతో వినికిడి సమస్య వల్ల మాటలు రాలేదు. అప్పులుచేసి కర్ణాటకలోనే ఆస్పత్రులు తిప్పుతూ నానా తిప్పలు పడ్డాడు.
కొడుకుకి ఎలాగైనా మాట తెప్పించాలనే రమేష్ బాధలు చూసిన అక్కడి తెలుగువారు, మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యానికి సాయం చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్లి ప్రయత్నించు అని చెప్పిన సలహాతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2017వ సంవత్సరంలో టీడీపీ సర్కారు మంజూరు చేసిన రూ.5.20 లక్షలతో హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో పవన్ కి చికిత్స చేశారు.
పవన్ కి మాట వచ్చింది. వినికిడి యంత్రాలు అమర్చారు. బర్మా రమేష్ ఆనందానికి అవధుల్లేవు. తాను బిడ్డకి జన్మనిస్తే... మాట వచ్చేలా వైద్యానికి సాయం అందించి చంద్రబాబు పునర్జన్మ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు. యువగళం పాదయాత్రలో సింగనమల నియోజకవర్గం వచ్చిన నారా లోకేశ్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో మాట వచ్చిన పవన్, 9వ ఏట అడుగుపెట్టి బనకచెర్లలో చదువుకుంటున్నాడని లోకేశ్ కు వివరించారు.
* యువగళం పాదయాత్ర వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన దూరం 815.7 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 10.3 కి.మీ.*
*64వరోజు (8-4-2023) యువగళం వివరాలు:*
*శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం*
సాయంత్రం
4.00 – జంబులదిన్నె కొట్టాల వద్ద రైతన్నతో లోకేష్ కార్యక్రమం.
5.30 – జంబులదిన్నె కొట్టాల విడిది కేంద్రంలో బస.