Andhra Pradesh: మొన్న ఐఏఎస్ లు.. ఇప్పుడు ఐపీఎస్ లు.. ఏపీలో భారీగా బదిలీలు
- 39 మంది అధికారులకు స్థాన చలనం
- ఇప్పటికే 56 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
- ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ చర్చ
రెండు రోజుల కిందట భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఐపీఎస్ అధికారులకు కూడా స్థాన చలనం కల్పించింది. ఒకేసారి 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు చర్చనీయాంశమయ్యాయి. 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండు జీవోలను జారీ చేసి పలు స్థానాల్లో ఐపీఎస్ లను మార్చింది.
బదిలీ అయిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, గుంటూరు రేంజ్ ఐజీ జి. పాలరాజు, అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, ఏపీఎస్పీ డీఐజీ బి. రాజకుమారి ఉన్నారు. గ్రేహౌండ్స్ డీఐజీ కోయ ప్రవీణ్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంకబ్రత బాగ్చి, సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్, విశాఖపట్నం సిటీ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ, విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్, అక్టోపస్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తదితరులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.