pm modi: ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కు కుర్చీ!
- పరేడ్ గ్రౌండ్స్ సభావేదికపై ముఖ్యమంత్రికి సీటు రిజర్వ్
- కేసీఆర్ హాజరుకావట్లేదని తెలిసినా ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సహా మరో పదిమంది నేతలకు సీట్లు
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ సభావేదిక పైనుంచి ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభా వేదికపై నిర్వాహకులు పలువురు ప్రముఖులకు కుర్చీలు ఏర్పాటు చేశారు. మోదీ సభకు సీఎం కేసీఆర్ హాజరుకావట్లేదని ఇప్పటికే సీఎంవో నుంచి అధికారికంగా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభావేదికపై సీఎం కేసీఆర్ పేరుతో ఓ సీటును రిజర్వ్ చేశారు. ప్రధాని సీటుకు ఎడమవైపు సీఎం కేసీఆర్ కు, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోసం కుర్చీ ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీ వేశారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి తదితరుల కోసం మొత్తం పది సీట్లను రిజర్వ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారమే ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ రాకకు ముందే సభావేదికపై సీట్లు కేటాయించిన వారంతా హాజరుకావాలి. రిజర్వ్ చేసిన సీట్లకు సంబంధించిన నేతల్లో ఎవరైనా రాకపోతే వెంటనే ఆ సీటును అధికారులు తొలగిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నిర్ణయం తీసుకుంటారు.