Bengaluru: ఒకే ఆటోకి మూడు రిజిస్ట్రేషన్ నంబర్లు
- బెంగళూరు నగరంలో సంచరిస్తున్న ఓ ఆటో
- ట్విట్టర్ లో దీనిపై ఆరోగ్యకర చర్చ
- ఇలాంటివి చూస్తే భయం వేస్తోందన్న ఓ యూజర్
- వివరాలు పంపితే దర్యాప్తు చేస్తామన్న ఓలా సపోర్ట్ టీమ్
ఒక వాహనానికి ఒకటే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. కానీ, బెంగళూరులో ఓ ఆటో ఏకంగా మూడు రిజిస్ట్రేషన్ నంబర్లతో సంచరిస్తోంది. నంబర్లు మార్చి, మార్చి తిరుగుతోందని అనుకునేరు. కానే కాదు. వాహనంపై మూడు రిజిస్ట్రేషన్ నంబర్లు తగిలించుకుని మరీ తిరుగుతోంది. దీన్ని చూసిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసి దీనిపై చర్చకు అవకాశం కల్పించారు.
ఆటోకి అధికారిక నంబర్ ప్లేట్ ఒక్కటే బిగించి ఉంది. కానీ, పరిశీలించి చూస్తే ఒక పేపర్ పై రెండు రిజిస్ట్రేషన్ నంబర్లు ముద్రించి అంటించుకోవడం కనిపిస్తుంది. అందులో ఓలాకి ఒక రిజిస్ట్రేషన్ నంబర్, ర్యాపిడోకి మరో రిజిస్ట్రేషన్ నంబర్ అని రాసి ఉంది. దీన్ని చూసిన వారు ఇలా కూడా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉంటాయా? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక వాహనానికి ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉంటే, ఎక్కువ? అంటూ సుప్రీత్ అనే వ్యక్తి ప్రశ్నించాడు.
ఈ ఫొటో చాలా మంది కళ్లు తెరిపించింది. దీప అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ఓలా ద్వారా బుక్ చేసినప్పుడు ఒక్కో వాహనం ఒక్కోసారి భిన్నమైన నంబర్ తో రావడం చూసి ఆశ్చర్యపోయాను. అలాంటివి చూసినప్పుడు భద్రత పట్ల భయం వేస్తోంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో దీప ట్వీట్ కి ఓలా సపోర్ట్ టీమ్ కూడా స్పందించింది. ‘‘ఇది మాకు సైతం ఆందోళన కలిగిస్తోంది. మీ కోసం ఈ అంశంపై తప్పకుండా దృష్టి సారిస్తాం. ఈ తరహా సందర్భాలకు సంబంధించి సీఆర్ఎన్ నంబర్, మీ ఈ మెయిల్ ఐడీని మాకు షేర్ చేయండి, దర్యాప్తు చేస్తాం’’ అని బదులిచ్చింది.