India: 204 రోజుల తర్వాత అత్యధికంగా దేశంలో నిన్న 6,155 కరోనా కేసులు
- భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
- కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసుల నమోదు
- పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడంతో ఆందోళన
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్నాళ్లుగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా మరో 6,155 మంది కరోనా బారినపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక రోజుల్లో ఇన్ని కేసులు రావడం గత 204 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,47,51,259కి చేరింది. ప్రస్తుతం దేశంలో 31,194 క్రియాశీల కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. అదే సమయంలో గత 24 గంటల్లో 11 మంది వైరస్ వల్ల మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,954కి చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు సూచించారు.