ipl: అదే మమ్మల్ని ముంచింది: సన్ రైజర్స్ కోచ్ లారా
- వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన హైదరాబాద్
- బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం అంటున్న హెడ్ కోచ్
- ఆరంభంలోనే వికెట్లు పడటం దెబ్బతీసిందని వ్యాఖ్య
ఐపీఎల్ లో గత రెండు సీజన్లలో 8వ స్థానంతో నిరాశ పరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు మారడం లేదు. తాజా సీజన్ ను కూడా రెండు ఘోర పరాజయాలతో ప్రారంభించింది. తొలి పోరులో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన రైజర్స్ నిన్న రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. రెండు మ్యాచ్ ల్లోనూ పేలవ బ్యాటింగ్ తో నిరాశ పరిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాపార్డర్ చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోతున్నామని చెప్పాడు. లక్నోతో మ్యాచ్ తర్వాత లారా మీడియాతో మాట్లాడాడు.
‘మేం ఆడిన పిచ్ స్ట్రోక్ ప్లేకు అనుకూలించలేదు. కానీ, మా ఓటమికి దాన్ని సాకుగా చెప్పడం లేదు. కచ్చితంగా మా బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాను. మేం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్నాం. తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయం. ఈ రాత్రి (లక్నోతో పోరు) ఏడు బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోవడం ఆట రూపురేఖలను మార్చేసింది. అన్మోల్ ప్రీత్, మార్ క్రమ్, బ్రూక్ ముగ్గురూ ఔటవడం మమ్మల్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. కాబట్టి కచ్చితంగా మా బ్యాటింగ్ మెరుగవ్వాల్సి ఉంది. ఈ సమస్యకు మేం తక్షణమే పరిష్కారం కనుగొనాలి’ అని చెప్పుకొచ్చాడు. లోపాలు సరి చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని లారా పేర్కొన్నాడు.