MS Dhoni: ధోనీ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పిన రాబిన్ ఊతప్ప
- ధోనీకి వ్యతిరేకంగా ఆడడం చిరాకు పుట్టిస్తుందన్న ఊతప్ప
- ధోనీ ప్లానింగ్ అద్భుతమని వెల్లడి
- బ్యాట్స్ మన్ల మైండ్ తో ఆడుకుంటాడని వివరణ
మైదానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత కూల్ గా కనిపిస్తాడో, అతడి బుర్ర లోపల మాత్రం ఆలోచనలు పాదరసం కంటే వేగంగా ప్రయాణిస్తుంటాయి. ప్రత్యర్థి ఆటను విశ్లేషించడంలో అతడికి అతడే సాటి! టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో ధోనీకి వ్యతిరేకంగా ఆడాల్సి వచ్చినప్పుడు ఎంతో చిరాకు పుట్టేదని వెల్లడించాడు.
ఓ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ కు రాగా హేజిల్ వుడ్ బౌలింగ్ చేస్తున్నాడని, కానీ ఆ సమయంలో ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ఎవరూ లేరని ఊతప్ప తెలిపాడు. "దాంతో హేజిల్ వుడ్ తర్వాత బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తాడని ఊహించాను. ఆ బంతిని డీప్ పాయింట్ లో బౌండరీ కొట్టాలని భావించాను... కానీ అవుటయ్యాను.
ధోనీ వ్యూహాలు ఎలా ఉంటాయంటే... మీరు ఎక్కువగా షాట్లు ఆడని ప్రదేశాల్లో బలవంతంగా షాట్లు ఆడేలా పురికొల్పుతాడు... అలాంటి పరిస్థితులు సృష్టిస్తాడు. సరిగ్గా చెప్పాలంటే బ్యాట్స్ మన్ల ఆలోచనలతో ధోనీ ఆడుకుంటాడు. బ్యాట్స్ మెన్ ఆలోచనలను పక్కదారి పట్టించడమే కాదు, బౌలర్లు విభిన్నంగా ఆలోచించేలా వారిని ప్రోత్సహిస్తాడు.
ఒక్కోసారి బ్యాట్స్ మన్ కు ఇష్టమైన షాట్ ఆడేలా వల పన్ని కూడా వికెట్ సాధిస్తాడు. ఓసారి దేవదత్ పడిక్కల్ విషయంలో ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. పికప్ షాట్ కొట్టడంలో పడిక్కల్ సిద్ధహస్తుడు. సరే... చూద్దాం... అతడు పికప్ షాట్ ఆడేలా బంతులు విసరండి... అంటూ ధోనీ అప్పటికప్పుడు ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ను పెట్టేశాడు. చూస్తే అదొక లెగ్ గల్లీ ఫీల్డింగ్ పొజిషన్ లాగానే అనిపించింది... అసలు, ఇతడికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని ఆశ్చర్యానికి గురయ్యేవాడ్ని" అని ఊతప్ప వివరించాడు. ఊతప్ప ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా ప్రాతినిధ్యం వహించాడు.