Kanipakam: కాణిపాకం ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో జింకచర్మం.. స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు
- కాణిపాకం ఆలయ సిబ్బంది చేతివాటం
- ఆలయ పోటు, గిడ్డంగి నుంచి సరుకులు లేపేస్తున్న సిబ్బంది
- రూ. 1.30 లక్షల విలువైన సరుకుల స్వాధీనం
కాణిపాకం వరసిద్ధి వినాయక అనుబంధ ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మం దొరకడం కలకలం రేపింది. దానిని స్వాధీనం చేసుకున్న అధికారులు అర్చకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వంట మనుషుల ఇళ్లలో పెద్ద ఎత్తున బియ్యం బస్తాలు, సరుకులు గుర్తించారు. మరికొందరి ఇళ్లలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కాపుకాసి పట్టుకున్న ఈవో
అన్నదాన భవనం వద్ద ఈవో రహస్యంగా కాపుకాసి గిడ్డంగి నుంచి సరుకులు తరలిస్తున్న బైక్‌ను వెంబడించి వంట మనిషి ఇంటికి వెళ్లి పరిశీలించి సరుకులను గుర్తించారు. అలాగే, మిగిలిన సిబ్బంది నివాసాల్లోనూ తనిఖీలు చేసి మొత్తంగా రూ. 1.30 లక్షల విలువైన సరుకులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురి ఇళ్లలో ఆలయ సరుకులు గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదుపులో అర్చకుడు
కాణిపాకం అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ ఇంట్లో జరిపిన సోదాల్లో జింక చర్మాన్ని గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తాను దానిని ఓ వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్టు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు ఎఫ్ఆర్‌వో బాలకృష్ణారెడ్డి తెలిపారు.