Kurnool District: పూజారితో తన్నించుకునేందుకు ఎగబడుతున్న భక్తులు! ఎక్కడంటే..
- కర్నూలు జిల్లా చిన్న హోతూరు గ్రామంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
- శ్రీ సిద్ధేశ్వరస్వామి రథోత్సవాల చివరి రోజున భక్తులకు పూజారితో తన్నులు
- శివుడి కుమారుడు వీరభద్రుడు పూజారి రూపంలో తమను అనుగ్రహిస్తున్నారని ప్రజల విశ్వాసం
- పూజారి తన్నులతో మోక్షం వస్తుందని నమ్మకం
దైవ దర్శనం కోసం భక్తులు క్యూకట్టడం అందరికీ తెలిసిందే. కానీ..ఆ ఆలయంలో మాత్రం పూజారితో తన్నించుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఆ తన్నులతో మోక్షం తప్పక సిద్ధిస్తుందనే నమ్మకంతో ఆలయం ముందు క్యూకడుతున్నారు. దీంతో ఈ ఆలయం తనదైన ప్రత్యేకత సంతరించుకుంది.
కర్నూలు జిల్లా చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి రథోత్సవాలు ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపీ విరూపాక్ష స్వామి రథోత్సవాల మాదిరిగా చిన్న హోతూరులో కూడా మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించేవారని భక్తుల నమ్మకం. నాటి ఉత్సవాల చివరి రోజున శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివపార్వతుల కల్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉన్నట్టు భక్తులు చెబుతున్నారు. అయితే..కల్యాణ సమయంలో భక్తులు కొన్ని తప్పులు చేయడంతో శివుడి కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆలయ పూజారీ రూపంలో ఆయన గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్టు ఆలయ చరిత్రలో ఉంది. అలా స్వామి తన్నులు తిన్న వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
దాదాపు 500 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రతి ఏటా కల్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు బారులు తీరుతారు. ఈ క్రమంలో పూజారీ స్వామి వారి ఉత్సవవిగ్రహాలు తలపై పెట్టుకుని, ఓ చేత్తో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం వెలుపలకు పరిగెత్తుకుంటూ వస్తారు. బయట బారులు తీరిన భక్తుల్లో కొందరు భక్తులను నాట్యం చేస్తూ తన్నుతూ వెళతారు. ఇలా తన్నులు తిన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ తన్నులతో తమకు మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు.