Virender Sehwag: డేవిడ్.. అలా అయితే ఐపీఎల్ కు రాకు: వీరేంద్ర సెహ్వాగ్
- 25 బంతులకే 50 పరుగులు చేసేట్టుగా ఆడాలన్న అభిప్రాయం
- ధాటిగా ఆడలేకపోతే ముందే అవుట్ కావడం మంచిదన్న సెహ్వాగ్
- 30 పరుగులకే అవుట్ అయితే జట్టుకు మంచిదని వ్యాఖ్య
గువహటి లో రాజస్థాన్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు కురిపించాడు. శనివారం నాటి మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది. కానీ, రాజస్థాన్ బ్యాటర్లు ఢిల్లీ బౌలింగ్ ను చీల్చి చెండాడి, 200 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచారు. ఓపెనర్లు పృథ్వీ షా విఫలం కాగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలదొక్కుకుని 65 పరుగులు సాధించాడు. అయినా కానీ, అది జట్టును గెలిపించే ఇన్నింగ్స్ కాలేదు.
దీనినే సెహ్వాగ్ టార్గెట్ చేసుకున్నాడు. 55 బంతులు తిని 65 పరుగులు చేయడం కాదని, వేగంగా, దూకుడుగా ఆడితేనే అంతపెద్ద లక్ష్యాన్ని ఛేదింగలమన్న విషయాన్ని తన మాటల ద్వారా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 142 పరుగులకే తన ఆటను ముగించింది. రాజస్థాన్ జట్టు 57 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ‘‘డేవిడ్ నీవు నా మాటలు వినేట్టు అయితే గొప్పగా ఆడు. 25 బాల్స్ కు 50 పరుగులు చేయి. జైస్వాల్ ను చూసి (రాజస్థాన్ బ్యాటర్) నేర్చుకో. అతడు 25 బంతులే తీసుకున్నాడు. నీవు అలా ఆడలేకపోతే దయచేసి ఐపీఎల్ ఆడేందుకు రాకు’’అని సెహ్వాగ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రిక్ బజ్ సంస్థతో మాట్లాడుతూ అలా అన్నాడు.
వార్నర్ బంతులను తినేయడం వల్ల, బిగ్ హిట్టర్లు ముందుగా క్రీజులోకి రాలేకపోయినట్టు సెహ్వాగ్ చెప్పాడు. ‘‘డేవిడ్ వార్నర్ 30 పరుగులకే అవుట్ అయితే అది జట్టుకు మంచిది. ఎందుకంటే రావ్ మన్ పావెల్, ఇషాన్ పోరెల్ చాలా ముందుగా బ్యాటింగ్ కు వచ్చి ఉండేవారు’’అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.