Soyam Bapu Rao: ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
- పాడేరులో నిర్వహించిన జనజాతి సురక్ష మంచ్ ర్యాలీకి హాజరైన ఆదిలాబాద్ ఎంపీ
- 80 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మూడున్నర గంటలు పట్టిందన్న సోయం బాపురావు
- పాడేరు వాసులు విశాఖ ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన
- కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోని వారు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోందన్న ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రహదారులపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు పెదవి విరిచారు. రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాడేరు వాసులను తలచుకుంటుంటే జాలేస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో నిన్న జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన ర్యాలీకి ఎంపీ హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు, కేంద్ర ఫిలింబోర్డు సభ్యుడు చల్లా రామకృష్ణ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాపురావు విలేకరులతో మాట్లాడుతూ.. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టిందన్నారు. తమ రాష్ట్రం (తెలంగాణ) వెనకబడి ఉందని అనుకున్నానని కానీ, ఇక్కడి పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. పాడేరు వాసులు విశాఖపట్టణం ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమని అన్నారు. కొన్ని కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోని వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.