Civil Sevice Officers: సివిల్ సర్వీసెస్ అధికారుల్లో చాలా మంది దొంగలే అంటూ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
- కోడిని దొంగతనం చేసే వాడికి కూడా శిక్ష పడుతుందన్న బిశేశ్వర్
- మాఫియాను నడిపించే అధికారిని మాత్రం వ్యవస్థ రక్షిస్తుందని విమర్శ
- సివిల్ సర్వీసెస్ అధికారులపై తన అభిప్రాయం మారిపోయిందని వ్యాఖ్య
దేశంలోని సివిల్ సర్వీసెస్ అధికారుల్లో ఎక్కువ మంది దొంగలేనని కేంద్ర మంత్రి బిశేశ్వర్ తుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడిని ఎత్తుకు పోయిన వాడికి మన దగ్గర శిక్ష పడుతుంటుందని... ఇదే సమయంలో మినరల్ మాఫియాను నడిపించే అధికారికి మాత్రం శిక్ష పడదని, అతన్ని వ్యవస్థ రక్షిస్తుంటుందని అన్నారు. యూపీఎస్సీ ద్వారా కేంద్ర సర్వీసుల్లోకి వచ్చే ఈ అధికారులు ఎంతో తెలివైన వారని, అందరూ కూడా ఉన్నత విలువలు కలిగి ఉంటారని తాను భావించే వాడినని చెప్పారు. అయితే వారిపై ఇప్పుడు తన అభిప్రాయం మారిపోయిందని అన్నారు. వాళ్లలో ఎక్కువ మంది దొంగలేనని చెప్పారు. విద్యా విధానంలో నైతిక విలువలు లేకపోవడం వల్లే అవినీతి పెరిగిపోతోందని అన్నారు. మన విద్యలో ఆధ్యాత్మికత అంశాలు లేకపోవడం, మనలో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోవడమే దీనికి కారణమని చెప్పారు.