Earthquake: అండమాన్ లో స్వల్ప భూకంపం.. 24 గంటల్లో మూడో సారి.. మిజోరంలో కూడా!
- ఆదివారం అండమాన్ లో రెండు సార్లు కంపించిన భూమి
- ఈరోజు క్యాంప్‌బెల్ బేలో 4.6 తీవ్రతతో ప్రకపంనలు
- మిజోరంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు
అండమాన్ నికోబార్ దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారుజామున దాకా 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం క్యాంప్‌బెల్ తీరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 32 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు చోటుచేసుకున్నాయని చెప్పింది.
తర్వాత మిజోరంలోనూ ఉదయం 6.16 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్ సీఎస్ తెలిపింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, చాంఫైకి నుంచి 151 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం 2.59 గంటలకు మొదటిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. తర్వాత గంటల వ్యవధిలోనే మరోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూమికి 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా ఎన్ సీఎస్ వెల్లడించింది.
ఇక ఈనెల 6న కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. గత గురువారం రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది.