Varada Rajulu Reddy: ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపునకు కృషి చేస్తా.. త్వరలోనే చంద్రబాబును కలుస్తా: వరదరాజులు రెడ్డి
- తాను కొన్నాళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేనన్న వరదరాజులురెడ్డి
- ప్రొద్దుటూరులో అరాచకాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపణ
- మళ్లీ టీడీపీలో క్రియాశీలకంగా పని చేయనున్నట్లు వెల్లడి
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతానని వ్యాఖ్య
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ‘‘రెండేళ్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అరాచకాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. స్థానికంగా జనాల్లో ఆందోళన ఉంది. నన్ను ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిపించిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించాను. అందుకే మళ్లీ టీడీపీలో క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని ప్రకటించారు.
తాను కొన్నాళ్ల నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేనని వరదరాజులురెడ్డి అన్నారు. ఇక క్రియాశీలకంగా పని చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపునకు ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. తాను త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి రాజకీయ పరిస్థితులపై మాట్లాడతానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతానని చెప్పారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పని చేస్తామని చెప్పారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చినా అన్నివిధాలుగా సహకరిస్తానని వివరించారు. ప్రొద్దుటూరు టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేయడానికి తాను సిద్ధమని, అయితే ప్రజల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
1985లో టీడీపీ నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా తొలిసారి వరదరాజులు రెడ్డి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. 2004 వరకు వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2009లో టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ప్రొద్దుటూరు నుంచి పోటీచేసి ఓడారు. 2019లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.