every day: ఆరోగ్యం విషయంలో ఈ తప్పులు చేయొద్దు..!
- మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయం మరవద్దు
- కంటి నిండా నిద్ర ఉన్నప్పుడే శరీరానికి నూతనోత్తేజం
- తగినంత నీరు అందకపోతే ఎన్నో సమస్యలు
అన్నింటికంటే ఆరోగ్యమే ప్రధానం. ఇది నేడు ఎక్కువ మంది అంగీకరించే విషయం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ పనికిరావు. అసంబద్ధ జీవనశైలి, ఆహార నియమాలతో మన ఆరోగ్యాన్ని తీసుకెళ్లి వైద్యుల చేతుల్లో పెట్టేలా పరిస్థితి తెచ్చుకోకూడదు. మంచి అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తాయి. ఆరోగ్యం విషయంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం.
తక్కువ నిద్ర
రోజంతా ఎంతో కష్టపడుతుంటాం. అది శారరీక కష్టం లేదా మానసిక కష్టం కావచ్చు. అలా గంటల తరబడి శ్రమించిన తర్వాత శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. అప్పుడు అవి తిరిగి నూతన శక్తిని సంతరించుకుంటాయి. అందుకే మన శరీరానికి కావాల్సినంత నిద్రను ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇలా చేసినట్టయితే కణాల నిర్మాణానికి, కణ పునరుత్తేజానికి వీలు కల్పించినవారు అవుతారు. తగినంత నిద్ర లేకపోతే అది రోగ నిరోధక వ్యవస్థ బలహీనతకు దారితీస్తుంది. మానసిక పరమైన సమస్యలు ఎదురు చూస్తాయి. మధుమేహం, గుండె జబ్బులకు కారణమవుతుంది. అలాగే, రక్తపోటు, స్ట్రోక్, స్లీప్ అప్నియా ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం 8 గంటల పాటు మంచి నిద్ర పోవడమే.
తగినంత నీరు
మనలో చాలా మంది తమ శరీరానికి కావాల్సినంత నీరు అందించరు. మన శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేందుకు పుష్కలమైన నీటిని ఇవ్వాల్సిందే. తగినంత నీరు ఉన్నప్పుడు కిడ్నీలు చక్కగా పనిచేస్తూ, మలినాలను వడగడుతూ ఉంటాయి. తగినంత నీరు లేకపోతే కిడ్నీలు కూడా బద్దకిస్తాయి. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. డీహైడ్రేషన్ వల్ల నొప్పులు, అలసట కనిపిస్తాయి. తలనొప్పి, గొంతు ఎండిపోవడం, మూత్రం తక్కువగా రావడం, మూత్రం రంగు చిక్కగా ఉండడం ఇవన్నీ కూడా నీరు చాలడం లేదనడానికి నిదర్శనం. మలబద్ధకం ఉన్నా సరే నీరు తగినంత తీసుకోవడం లేదని గుర్తించాలి.
మానసిక ఆరోగ్యం
మానసికంగా దృఢంగా ఉండడం కూడా మంచి ఆరోగ్యంలో భాగం. కరోనా సమయంలో ఇది ఏంటో అర్థమైంది. లాక్ డౌన్ లతో స్వేచ్ఛా జీవుల సంచారానికి సంకెళ్లు పడ్డాయి. దాంతో చాలా మంది మానసిక పరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నేటి పని ఒత్తిడులు, ఆధునిక జీనవశైలి కారణంగా మానసిక సమస్యలు పెరిగాయి. అందుకని ప్రాణాయామం, యోగాసనాలతో వీటిని అధిగమించాలి. ఒత్తిడులు, కుంగుబాటు, ఆందోళన తదితర మానసిక సమస్యలు రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తాయి.
సన్ స్క్రీన్ లోషన్
ఇదేంటి? అనుకోకండి. ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చే వారు తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. లేదంటే చర్మం దెబ్బతినడంతోపాటు, కేన్సర్ రిస్క్ ఏర్పడుతుంది.