Health benefits: కాఫీతో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?
- రోజులో రెండు కప్పులకు పరిమితమైతే మంచిది
- అంతకుమించి తాగితే గుండె స్పందనల్లో మార్పులు
- దీర్ఘకాలంలో అట్రియల్ ఫిబ్రిలేషన్ రిస్క్
కాఫీ.. ఈ ప్రపంచంలో ఎంతో ఆదరణ ఉన్న పానీయం. మన దేశంలో సగం మంది కాఫీని ఇష్టపడతారు. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు కాఫీ సేవిస్తారు. మరి నిజానికి కాఫీతో ఆరోగ్యానికి ప్రయోజనం ఉందా..? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది.
కాఫీలో కెఫైన్ ఉంటుంది. ఇది ఒక ఉత్ప్రేరకం. ఒక రోజులో 400 ఎంజీ వరకు కెఫైన్ తీసుకోవడం ఆరోగ్యకరమేనని నిపుణులు సూచిస్తుంటారు. అంటే సుమారు ఓ నాలుగు కప్పులు. కానీ, అదే సమయంలో కాఫీ సేవనం ఎక్కువ అయితే, ఆరోగ్య సమస్యలు రావచ్చన్నది నిపుణుల హెచ్చరిక.
పరిశోధకులు 100 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులను వలంటీర్లుగా తీసుకున్నారు. రెండు వారాల పాటు వారికి కాఫీ తాగమని చెప్పి, వారి గుండె పనితీరు, నిద్ర తీరు, బ్లడ్ షుగర్ తీరును పరికరాల ద్వారా పర్యవేక్షించారు. 40 ఏళ్ల కంటే చిన్న వారిని అధ్యయనం కోసం తీసుకున్నారు. ప్రతి రోజూ ఎప్పుడు కాఫీ తీసుకోవాలి? ఎప్పుడు మానేయాలి? అనేది ఎస్ఎంఎస్ ద్వారా వారికి సూచిస్తూ, రెండు వారాల పాటు వారి శరీరంలో మార్పులను విశ్లేషించారు. ఈ అధ్యయనం ఫలితాలు ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి.
కాఫీ తాగిన వారి ఎగువ చాంబర్లలో స్పందనల రేటు తరచూగా రావడం లేదని గుర్తించారు. దీన్ని ప్రీ మెచ్యూర్ అట్రియల్ కాంట్రాక్షన్స్ గా పేర్కొన్నారు. ఎగువ చాంబర్లలో అధిక స్పందనలను సాధారణమేనని తెలిపారు. కానీ, అట్రియల్ ఫిబ్రిలేషన్ అనే (వేగంగా గుండె కొట్టుకోవడం, అసంబద్ధంగా కొట్టుకోవడం) పరిస్థితికి దారితీయవచ్చన్నది వారి అంచనా. కింది చాంబర్లలో క్రమం తప్పిన స్పందనలను కూడా గుర్తించారు. వీటిని ప్రీ మెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్ గా చెబుతారు. రోజులో రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగే వారికి ఈ సమస్యలు రాకపోవచ్చన్నది వీరి పరిశోధన సారాంశం.