Chiranjeevi: ఇద్దరు లెజెండ్స్ తో కలిసి పనిచేశాను .. ఇంతకంటే ఏం కావాలి?: సినీ రచయిత సాయిమాధవ్ బుర్రా
- చిన్నప్పటి నుంచే నాటకాలు వేశానన్న సాయిమాధవ్
- తనకి సినిమా పిచ్చి బాగా ఉండేదని వ్యాఖ్య
- చిరంజీవి - బాలయ్యల గురించిన ప్రస్తావన
టాలీవుడ్ స్టార్ రైటర్స్ లో సాయిమాధవ్ బుర్రా ఒకరుగా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్ ను చాలామంది అభిమానులు ఇష్టపడతారు. తమ సినిమాలకు ఆయన పని చేయాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. తాజాగా 'ఐ డ్రీమ్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది తెనాలిలో .. మా అమ్మానాన్నలు ఇద్దరూ కూడా స్టేజ్ ఆర్టిస్టులు. చిన్నతనంలోనే నేను నాటకాలలో నటించాను" అన్నారు.
"బొల్లిముంత శివరామకృష్ణగారు అప్పటికే చాలా పెద్దవారు .. కానీ ఆయన మాతో కూడా చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఆయన వల్లనే నాకు సాహిత్యంపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. తేలికైన పదాలతో విషయం ఎలా చెప్పాలనేది ఆయన నుంచే నాకు వచ్చింది. ఇక నాకు చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి ఉంది .. అందువలన ఇటువైపు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తరువాత, నేను నేర్చుకున్న సాహిత్యం నాకు సాయపడింది" అని చెప్పారు.
"రచయితగా నేను ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఎక్కువ కాలం పట్టింది. 'కృష్ణం వందే జగద్గురుమ్' తరువాత మాత్రం చకచకా అవకాశాలు వచ్చాయి. అటు చిరంజీవిగారి 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి .. ఇటు బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలకి రాశాను. ఇద్దరు లెజెండ్స్ సినిమాలకి రాశాను .. వాళ్ల ప్రశంసలను అందుకున్నాను .. ఇంతకంటే ఇంకా ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చారు.