Ghulam Nabi Azad: రాహుల్ గాంధీకి అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయి: గులాం నబీ ఆజాద్
- అదానీతో ఆజాద్ కు లింకులు ఉన్నాయన్న రాహుల్ గాంధీ
- రాహుల్ పార్టీపై ప్రభావం చూపలేకపోతున్నాడన్న ఆజాద్
- భారత్ జోడో తర్వాత రాహుల్ ప్రజాదరణేమీ పెరగలేదని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి కొందరు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో లింకులు ఉన్నాయని ఆరోపించారు.
"ఆ వ్యాపారవేత్తలతో వారి కుటుంబం మొత్తానికి సంబంధాలున్నాయి... రాహుల్ కు కూడా వారితో సంబంధాలున్నాయి... రాహుల్ విదేశాలకు బయల్దేరినప్పుడు ఎక్కడికి వెళతాడో 10 ఉదాహరణలు ఇవ్వగలను" అని గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఓ మలయాళ వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో సంబంధాలున్నవారిలో గులాం నబీ ఆజాద్ కూడా ఒకరని రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన నేపథ్యంలో... ఆజాద్ పైవిధంగా స్పందించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని, కొందరు నేతలు మాత్రం మిగిలున్నారని ఆజాద్ విమర్శలు చేశారు. రాహుల్ సహా ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతోందని అన్నారు.
"భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఛరిష్మా పెరిగిందని చాలామంది అంటున్నారు. నాకు తెలిసినంతవరకు అలాంటిదేమీ లేదు. రాహుల్ కు ప్రజాదరణ పెరగలేదు. రాహుల్ ఇటీవల సూరత్ కోర్టుకు వెళితే ఒక్క గుజరాతీ యువకుడు కానీ, గుజరాతీ రైతు కానీ ఆయనను కలిశారా?" అని ఆజాద్ ప్రశ్నించారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ పార్టీని వీడడంపైనా ఆజాద్ స్పందించారు. అనిల్ కాంగ్రెస్ ను వీడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల లోపు వయసున్న నేతలు కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోవడానికి కారణం రాహుల్ లో నాయకత్వ లక్షణాలు, దార్శనికత లేకపోవడమేనని విమర్శించారు.