Divorce: ఈ కారణంతోనూ భర్త విడాకులు తీసుకోవచ్చట!
- తల్లిదండ్రులను వదిలేసి రావాలనే భార్య నుంచి విడాకులు తీసుకోవచ్చన్న కోర్టు
- అత్తమామల పట్ల అది కోడలి క్రూరత్వమన్న కలకత్తా హైకోర్టు
- ఇలాంటి క్రూరమైన భార్య నుంచి విడిపోయే హక్కు భర్తకు ఉంటుందన్న హైకోర్టు
పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. కుటుంబ జీవనానికి వివాహమే పునాది. అయితే, వివిధ కారణాలతో దాంపత్య జీవితంలో ఇమడలేని వారు విడాకులు తీసుకోవడం సాధారణమైన విషయం. అయినప్పటికీ, కోర్టులు విడాకులు తీసుకోవడానికి కొన్ని కారణాలనే సహేతుకంగా భావిస్తాయి. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తల్లిదండ్రులను వదిలేసి రావాలంటూ ఒత్తిడి చేసే భార్య నుంచి విడాకులు తీసుకునే హక్కు భర్తకు ఉంటుందని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణం లేకుండా భర్త తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసే క్రూరమైన మనస్తత్వం ఉన్న భార్య నుంచి విడిపోవడం తప్పు కాదని స్పష్టం చేసింది.
తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడడం అనేది కుమారుడి పవిత్ర ధర్మం అని కలకత్తా హైకోర్టు పేర్కొంది. భారతీయ సంస్కృతి, నీతి ప్రకారం కుమారుడు తల్లిదండ్రులతో కలిసి జీవించడం అనేది సాధారణ అంశమని అభిప్రాయపడింది.
పశ్చిమ మిడ్నపూర్ కోర్టు ప్రశాంత్ కుమార్ మండల్ అనే వ్యక్తికి 2009లో భార్య జర్నా నుంచి విడాకులు మంజూరు చేసింది. భార్య క్రూరత్వం నేపథ్యంలో ఈ విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును జర్నా కలకత్తా హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యానించింది.