Nara Lokesh: పాలిచ్చే ఆవును వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు: లోకేశ్

Lokesh Yuvagalam Padayatra 66th day details

  • శింగనమల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ఉత్సాహంగా కొనసాగుతున్న యువగళం
  • లోకేశ్ తో పాటు కదం తొక్కుతున్న టీడీపీ శ్రేణులు
  • రేపు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 66వ రోజు శింగనమల నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. సోడనంపల్లి క్రాస్ లోని విడిది కేంద్రం నుండి సోమవారం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేశ్ తొలుత సోడనంపల్లి శివార్లలో గొర్రెల పెంపకందారులను కలసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర దారిలో ఎస్సీ కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై పారుతున్న మురుగునీటిని పరిశీలించి, అధికారంలోకి రాగానే డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం సలకంచెరువు వద్ద బీసీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారి సాధకబాధకాలు విన్నారు. కొరివిపల్లిలో యువనేత స్థానికులతో ముచ్చటించారు. ఉల్లికల్లు గ్రామంలో లోకేశ్ కు స్థానికులు స్వాగతం పలికారు. తర్వాత ఉల్లికుంటపల్లిలోని విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది. మంగళవారం ఉదయం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించనుంది.

మండుటెండ‌లో క‌ష్టజీవుల చెంత‌కొచ్చిన లోకేశ్

ఓవైపు మండుటెండ‌లు... మరోవైపు ఎడారిని త‌ల‌పించే రాయ‌ల‌సీమ భూములు... అయినా త‌ప్పని బ‌డుగు జీవుల బ‌తుకు ప‌య‌నం... కొండా,గుట్టల్లో గొర్రెలు మేపుతూ జీవ‌నం! ఈ స‌మ‌యంలో అనుకోని అతిథిలా వ‌చ్చి నారా లోకేశ్ గొర్రెల పెంప‌కందారుల‌ను ప‌ల‌క‌రించారు. 

సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి యువనేత నారా లోకేష్ 66వ రోజు పాదయాత్ర ఆరంభించారు. కొద్ది దూరం వెళ్లాక దారికి దూరంగా క‌నిపించిన గొర్రెల పెంప‌కందారుల వ‌ద్దకి వెళ్లిన నారా లోకేశ్ వారి జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీలాంటి క‌ష్ట‌జీవుల‌ని కలుసుకుని, మీ సమస్యల్ని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని వెల్లడించారు. 

"గొర్రెల పెంపకందారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గతంలో నా దృష్టికి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందించే ఏర్పాటు చేస్తా. సొంతంగా గొర్రెలు కొనుక్కోవాలనుకునే వారికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. వేసవికాలంలో జీవాలకు తాగునీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. చంద్రన్న బీమా పథకాన్ని గొర్రెల కాపరులకు వర్తింపజేస్తాం. జ‌గ‌న్ ర‌ద్దు చేసిన ప‌థ‌కాల‌న్నీ టీడీపీ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తాం" అని హామీ ఇచ్చారు.

బీసీలతో లోకేశ్ ముఖాముఖి సమావేశం

టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో బీసీ భవనాలు నిర్మిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. శింగనమల నియోజకవర్గం సలకంచెరువు గ్రామంలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత బీసీ కుల ధృవీకరణ పత్రాలు పంపించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ అని, బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించింది టీడీపీ అని స్పష్టం చేశారు. 

"టీడీపీ హయాంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను జగన్ 10 శాతం తగ్గించి బీసీలను కోలుకోలేని దెబ్బకొట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాలకు నిధులు, రుణాలు కేటాయిస్తాం. పాదయాత్రలో పాల్గొన్న 16 మంది బీసీ సోదరులపై శింగనమల ఎమ్మెల్యే భర్త అక్రమ కేసులు పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారు. అందుకే బీసీల రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 

బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేశారు. అందుకే ప్రతి రోజూ ఫుడ్ పాయిజన్ వార్తలు వింటున్నాం. బాబు గారి హయాంలో పౌష్ఠిక ఆహారం పిల్లలకి అందించాం. మెరుగైన వసతులు కల్పించాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అనంతపురానికి కియా లాంటి అనేక పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చింది టీడీపీ. కానీ ప్రజలు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు" అని వ్యాఖ్యానించారు.

లోకేశ్ ను కలిసిన చాగల్లు రిజర్వాయర్ బాధితులు

చాగల్లు రిజర్వాయర్ కారణంగా నిర్వాసితులైన ఉల్లికుంటపల్లి వాసులు నారా లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. చాగల్లు రిజర్వాయర్ ను 1.5 టీఎంసీ కెపాసిటీతో నిర్మించారని, ఉల్లికంటిపల్లి గ్రామం 1 టీఎంసీ నీరు వస్తే మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "టీడీపీ పాలనలో పునరావాస కాలనీ ఏర్పాటుచేసి 159 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పరిహారం మొత్తం పూర్తిస్థాయిలో ఇచ్చే లోపు ప్రభుత్వం మారిపోయింది. 

2019 ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉల్లికంటిపల్లి గ్రామస్తులకు అధికారంలోకి వచ్చిన నెలలోపు పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. నాలుగేళ్లు గడిచినా ఒక్కసారి కూడా బాధితుల మొఖం చూడలేదు. 70 కుటుంబాలు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. కానీ నేడు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి లోనై ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం మాకు ప్రధానంగా ఆర్ అండ్ ఆర్, పునరావాసం, సిమెంట్ రోడ్లు, శ్మశానం, పాఠశాల కావాలి. మా ఇళ్లు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికీ ఈ హామీ నెరవేరలేదు" అని గ్రామస్తులు వాపోయారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... ఉల్లికంటిపల్లి గ్రామాన్ని ఆదుకునే బాధ్యతను తెలుగుదేశంపార్టీ పూర్తిగా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మేం ఇచ్చిన ప్రతి హామీని తూ.చా తప్పకుండా మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే అమలు చేస్తాం. ఉల్లికంటిపల్లి చాగల్లు రిజర్వాయర్ పునరావాస కాలనీ ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ప్రకారం రావాల్సిన పరిహారం చెల్లిస్తాం. సిమెంట్ రోడ్లు, శ్మశానవాటికకు స్థలం, పాఠశాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తెలుగుదేశంపార్టీ అండగా నిలుస్తుంది" అని భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 845.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ.*

*67వరోజు (11-4-2023) యువగళం వివరాలు:

*తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

7.00 – ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.15 – పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశం. సింగంగుట్టపల్లిలో స్థానికులతో మాటామంతీ.

7.35 – తబ్జుల్లా -1 వద్ద స్థానికులతో భేటీ.

8.25 – తబ్జుల్లా -2 వద్ద స్థానికులతో సమావేశం.

10.10 – చాగల్లులో మత్స్యకారులతో సమావేశం.

11.00 – పెదపప్పూరు శివార్లలో దూదేకులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.00 – పెదపప్పూరు శివార్లలో భోజన విరామం.

3.00 – భోజన విరామస్థలంలో బుడగ జంగాలతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – పెదపప్పూరు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.25 – పెదపప్పూరు సుంకులమ్మ కాలనీలో చేనేతలు, స్థానికులతో సమావేశం.

4.35 – పెదపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద రజకులతో సమావేశం.

4.45 – పెదపప్పూరు రామకోటి వద్ద బుడుగ జంగాలతో సమావేశం.

4.55 – పెదపప్పూరు జడ్పీహెచ్ఎస్ స్కూలు వద్ద విద్యార్థులు, స్థానికులతో భేటీ.

5.05 – చినపప్పూరులో స్థానికులతో సమావేశం.

6.10 – గార్లదిన్నెలో స్థానికులతో సమావేశం.

7.00 – పసలూరులో స్థానికులతో సమావేశం.

7.15 – పసలూరు విడిది కేంద్రంలో బస.


  • Loading...

More Telugu News