TSPSC paper leakage case: టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు ఈడీ నోటీసులు
- టీఎస్‌పీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ, శంకర లక్ష్మికి నోటీసులు జారీ
- లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్
- దర్యాప్తుపై హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించనున్న సిట్
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ) తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా.. సిట్ అదుపులో ఉన్న లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులు దాఖలు చేసిన కీలక పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఎన్ఎస్‌యూఐ సహా పలువురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీపీడీవో, ఈవో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. సీడీపీవో, గ్రేడ్-1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. తీర్పు వచ్చే వరకూ నియామక ప్రక్రియ వాయిదా వేయాలని కూడా విన్నవించారు. మరోవైపు.. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సిట్ సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించనుంది.