Raghu Rama Krishna Raju: రామోజీరావు నలుగురికీ నిజమైన మార్గదర్శిలా జీవిస్తున్నారు: రఘురామకృష్ణరాజు
- కీరవాణి చెప్పినట్టు ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలన్న రఘురాజు
- మార్గదర్శిపై ఏపీ సీఐడీ తప్పడు కేసులు పెట్టిందని విమర్శ
- న్యాయం రామోజీరావు వైపే ఉందని వ్యాఖ్య
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. రామోజీరావు అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని కొనియాడారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి చెప్పినట్టు ఒక్క రోజైనా రామోజీరావులా గొప్పగా బతకాలని అన్నారు. నలుగురికీ నిజమైన మార్గదర్శిలా రామోజీరావు జీవిస్తున్నారని ప్రశంసించారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై ఏపీ సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. న్యాయం రామోజీరావు వైపే ఉందని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ విషయం తేలిపోతుందని అన్నారు.
మార్గదర్శిని మూసేస్తామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఐదు నెలల క్రితమే ఈ అధికారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా జగన్ నియమించారని తెలిపారు. జగన్ కక్ష సాధింపుల్లో భాగంగానే మార్గదర్శిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా గతంలో పని చేసిన వెంకట్రామిరెడ్డి... జగన్ కక్ష సాధింపులకు సహకరించి ఉండకపోవచ్చని, అందుకే ఆయనను జగన్ బదిలీ చేసి ఉంటారని అన్నారు.