ipl: తన నత్తనడక బ్యాటింగ్ ను సమర్థించుకున్న కేఎల్ రాహుల్
- ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 18 పరుగులే చేసిన లక్నో కెప్టెన్
- ఆరంభంలోనే వికెట్లు పడటంతోనే నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందన్న కేఎల్
- ఔట్ కాకపోయి ఉంటే సులువుగా గెలిచేవాళ్లమని వ్యాఖ్య
బెంగళూరులో సోమవారం రాత్రి ఆర్సీబీతో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి 12వ ఓవర్లో ఔట్ అయ్యాడు. ఇంతటి భారీ ఛేదనలో రాహుల్ నింపాదిగా ఆడటంపై విమర్శలు వచ్చాయి. అయితే, ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తీరును రాహుల్ సమర్థించుకున్నాడు. తాను క్రీజులో ఉన్న సమయంలో వరుసగా వికెట్లు పడటం వల్లే జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడానని చెప్పాడు.
‘నేను ఎక్కువ పరుగులు చేయాలనుకుంటున్నాను. చేస్తానన్న నమ్మకం ఉంది. స్ట్రయిక్ రేట్ కూడా పెరుగుతుంది. మేం లక్నోలో కఠినమైన వికెట్లపై రెండు మ్యాచ్ లు ఆడాము. ఈ రోజు (సోమవారం) ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయాం కాబట్టి నేను పరిస్థితులను గమనించా. ఆ పరిస్థితికి తగ్గట్టుగానే ఆడానని భావిస్తున్నా. ఒకవేళ నేను ఔట్ కాకుండా నికోలస్ పూరన్ తో చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే ఈ మ్యాచ్ ను సులువుగా గెలిచేవాళ్లం. ఒకసారి మంచి ఇన్నింగ్స్ సాధిస్తే నేను జోరందుకుంటాను. కచ్చితంగా మరింత మెరుగ్గా ఆడుతాను’ అని రాహుల్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.