Chandrachud: నా దగ్గర ట్రిక్స్ పని చేయవు.. న్యాయవాదిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం
- పిటిషన్ పై ముందస్తు విచారణ కోసం ప్రయత్నించిన న్యాయవాది
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ చంద్రచూడ్
- తన అధికారాల జోలికి రావద్దని హెచ్చరిక
తాను వేసిన పిటిషన్ పై ముందస్తు విచారణ కోసం ప్రయత్నించిన ఓ న్యాయవాదిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన అధికారాలను సవాల్ చేయొద్దంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది.
ఓ కేసును ఈ నెల 17న విచారణ జరిపేందుకు సీజేఐ లిస్ట్ చేశారు. అయితే అంతకన్నా ముందే విచారణ జరిపేందుకు మరో బెంచ్ ముందుకు పిటిషన్ ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీజేఐని సదరు లాయర్ కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ చంద్రచూడ్.. ‘‘మీ కేసు విచారణ 17వ తేదీన లిస్ట్ అయింది. ఇప్పుడు 14న విచారణ కోసం ఇంకో బెంచ్ ముందుకు వెళ్తానని చెబుతున్నారు. నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ పని చేయవు. మీ కేసు విచారణ 17నే చేపడతాం’’ అని తేల్చి చెప్పారు.
దీంతో సదరు న్యాయవాది.. సీజేఐకి క్షమాపణలు చెప్పారు. బదులిచ్చిన జస్టిస్ చంద్రచూడ్.. ‘‘మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం. నా అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి’’ అని స్పష్టం చేశారు. తన అధికారాల జోలికి రావద్దని హెచ్చరించారు. గత నెలలోనూ ఇలానే ఓ న్యాయవాది తీరుపై సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ విషయంలో న్యాయవాది పట్టుబట్టడంతో .. ‘‘నన్ను బెదిరించాలని చూడకండి. మీ బెదిరింపులకు లొంగను’’ అని వ్యాఖ్యానించారు.