Vishwa Samudra: భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు చేపట్టనున్న విశ్వ సముద్ర గ్రూప్
- శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టు
- ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
- పోర్టు నిర్మాణ పనులు విశ్వ సముద్ర సంస్థకు అప్పగింత
- పోర్టు అంచనా వ్యయం రూ.4 వేల కోట్లు
ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద భారీ గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ఏప్రిల్ 19న భావనపాడు పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ చేపడుతోంది.
ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) ఫేజ్-1 పనులను హైదరాబాద్ కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్, విశాఖకు చెందిన ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ కు అప్పగించింది. ఈ పనులను చేజిక్కించుకునే క్రమంలో విశ్వ సముద్ర, ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్స్... ప్రముఖ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్)ను వెనక్కి నెట్టాయి.
ఫేజ్-1 కింద భావనపాడు పోర్టులో సాలీనా 23.53 మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందించేందుకు పనులు చేపట్టనుండగా, ఫేజ్-2 కింద 83.3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందించేందుకు పనులు చేపట్టనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4 వేల కోట్లు. 2020 ఆగస్టులోనే భావనపాడు పోర్టు డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీ మారిటైమ్ బోర్డు సంపూర్ణ పర్యవేక్షణలో భావనపాడు పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీడీసీఎల్) ఈ పోర్టు అభివృద్ధిని చేపట్టనుంది.
కాగా, విశ్వ సముద్ర ఇంజినీరింగ్ గ్రూప్ భారీ ప్రాజెక్టులతో సత్తా చాటుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ రోప్ వే ప్రాజెక్టు కూడా విశ్వ సముద్ర సంస్థకే దక్కింది. ఈ రోప్ వే అంచనా వ్యయం రూ.815 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను విశ్వ సముద్రకు అప్పగించింది.