Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ రగడ... చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తమిళ ఆటగాళ్లెవరూ లేరన్న పీఎంకే ఎమ్మెల్యే
- తమిళ జట్టు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం
- తమిళ ప్రజల నుంచి వాణిజ్యపరంగా లాభాలు అందుకుంటున్నారని ఆరోపణ
ప్రపంచవ్యాప్త క్రికెట్ ప్రేమికులకు వినోదం అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తమిళనాడు అసెంబ్లీలో మాత్రం రగడకు కారణమైంది. తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక్క తమిళ ఆటగాడు కూడా లేడని పీఎంకే పార్టీ మండిపడింది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పట్టలి మక్కళ్ కట్చి (పీఎంకే) శాసనసభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ ఇవాళ అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
తమిళనాడులో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం కనీసం ఒక్క తమిళ క్రికెటర్ ను కూడా ఎంపిక చేయలేదని వెంకటేశ్వరన్ మండిపడ్డారు. తమిళనాడు టీమ్ అని ప్రచారం చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ ప్రజల నుంచి వాణిజ్యపరమైన లాభాలు అందుకుంటుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై చర్చ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఇక, అన్నాడీఎంకే మాత్రం మరోలా స్పందించింది. ఎమ్మెల్యేలకు ఐపీఎల్ టికెట్లు సమకూర్చాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు ఉచితంగా పాసులు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.