Mumbai Indians: హోరాహోరీ పోరులో ముంబయి ఇండియన్స్ విజేత

Mumbai Indians won the thriller by 6 wickets

  • ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో విక్టరీ
  • రాణించిన రోహిత్ శర్మ, తిలక్ వర్మ
  • చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్
  • పట్టువదలకుండా పోరాడిన కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్
  • రెండు ఓటముల తర్వాత ఎట్టకేలకు గెలిచిన ముంబయి
  • ఢిల్లీకి వరుసగా నాలుగో ఓటమి

ఐపీఎల్ అగ్రశ్రేణి జట్లలో ఒకటైన ముంబయి ఇండియన్స్ తాజా సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన తెలుగుతేజం తిలక్ వర్మ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేశాడు. 

కీలక సమయంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అవుట్ కావడంతో ముంబయి కష్టాల్లో పడినట్టు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే అవుటై ముంబయి శిబిరాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. 

అయితే, చివర్లో కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ జోడీ మరో వికెట్ పడకుండా ముంబయి ఇండియన్స్ ను విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ ను నోర్కియా కట్టుదిట్టంగా వేయడంతో చివరి బంతికి ముంబయి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ అద్భుతమైన రీతిలో రెండు పరుగులు తీసి ముంబయి శిబిరంలో ఆనందం నింపారు. గ్రీన్ 17, టిమ్ డేవిడ్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. 

కాగా, ఈ ఓటమి ఢిల్లీ జట్టుకు నాలుగోది. ఇన్నింగ్స్ ను 19వ ఓవర్ వేసిన ముస్తాఫిజూర్ భారీగా పరుగులు ఇవ్వడం ఢిల్లీకి ప్రతికూలంగా మారింది.

  • Loading...

More Telugu News