Surya Kumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌ను వెంటాడుతున్న ‘గోల్డెన్ డక్స్’!
- ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ వరస డక్‌లు
- ఢిల్లీతో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే ఔట్
- 26 రోజుల్లో నాలుగోసారి ‘గోల్డెన్ డక్’
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు కాలం కలిసి రావడం లేదు. ఈ టీమిండియా బ్యాటర్‌ను గోల్డెన్ డక్స్ వెంటాడుతున్నాయి. ఢిల్లీ కేపిటల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ బౌలింగులో ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. గత 26 రోజుల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్ డక్. ఈ సీజన్‌లో ఇది మొదటిది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 16 పరుగులు మాత్రమే చేశాడు.
అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాడు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో సూర్యకుమార్ కంటికి గాయమైంది.
ఢిల్లీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో సూర్యకుమార్ గాయపడ్డాడు. జాసన్ బెహరెండార్ఫ్ వేసిన బంతిని అక్షర్ పటేల్ బలంగా బాదాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌లో ఉన్న సూర్య దానిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి అతడి కంటిని తాకి బౌండరీ లైన్‌కు ఆవల పడింది. అయితే, పెద్ద ప్రమాదమేమీ లేకపోవడంతో బ్యాటింగ్‌కు దిగినప్పటికీ తీవ్రంగా నిరాశ పరిచాడు.