IPL: కోహ్లీని విమర్శించిన వ్యాఖ్యాతపై పాక్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
- లక్నోతో మ్యాచ్ లో 42 నంచి 50 పరుగులు అందుకునేందుకు 10 బంతులు తీసుకున్న విరాట్
- వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఇలా నిదానంగా బ్యాటింగ్ చేశాడన్న వ్యాఖ్యాత సైమన్ డౌల్
- ఇదంతా చెత్త వాగుడు అంటూ డౌల్ పై సల్మాన్ భట్ విమర్శలు
భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన 46వ అర్ధసెంచరీని సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ పై నమోదు చేశాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ 35 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే, కోహ్లీ 42 నుంచి 50 పరుగుల మార్కు అందుకోవడానికి 10 బంతులు ఎదుర్కొన్నాడు. దీనిపై వ్యాఖ్యాత, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ పెదవి విరిచారు. కోహ్లీ జట్టు కోసం కాకుండా వ్యక్తిగత మైలురాయి గురించి ఆందోళన చెందుతున్నాడని వ్యాఖ్యానించాడు. చేతిలో వికెట్లు ఉన్నప్పుడు జోరు కొనసాగించాల్సిన సమయంలో కోహ్లీ నత్తనడకన బ్యాటింగ్ చేశాడని అభిప్రాయపడ్డాడు. డౌల్ వ్యాఖ్యలపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. అనూహ్యంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సైతం న్యూజిలాండ్ మాజీ పేసర్ డౌల్ పై మండిపడ్డాడు. డౌల్ చెత్త వ్యాఖ్యలు చేశాడంటూ విమర్శించాడు.
‘డౌల్ పాకిస్థాన్ మ్యాచ్ లకు కామెంటరీ చేస్తున్నప్పుడు కూడా బాబర్ ఆజమ్ విషయంలో ఇలాంటి పదాలు ఉపయోగించాడు. అతను మనస్సాక్షిగా ఆటను వీక్షించి ఉంటే కోహ్లీ.. స్పిన్నర్ బిష్ణోయ్ బౌలింగ్ లో మూడు నాలుగు సార్లు షాట్లు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, షాట్లు కనెక్ట్ కాలేదు. ఇది ఆటలో ఓ భాగం. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు సాధించాడు. తను ఇంకా ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. డౌల్ చెత్త వాగుడు వాగాడు’ అంటూ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
75 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ లాంటి ఆటగాడు మైలురాళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డౌల్‌కు బట్ సూచించాడు. ‘అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. మీరు ఇలాంటి సంకుచిత ఆలోచన నుంచి బయటపడండి. బాబర్, విరాట్, విలియమ్సన్ వంటి పెద్ద ఆటగాళ్లందరూ పవర్ హిట్టర్లు కాదు. వారు తమ వికెట్‌కు విలువనిస్తారు. బహుశా ఇలాంటి వ్యాఖ్యలతో డౌల్ వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు’ అని భట్ చెప్పుకొచ్చాడు.