Cricket: రూ. 117 కోట్లతో ఉప్పల్ స్టేడియం ఆధునికీకరణ
- మారనున్న స్టేడియం రూపురేఖలు
- దేశంలోని ఐదు స్టేడియాల్లో సౌకర్యాలు కల్పించనున్న బీసీసీఐ
- ఇందుకోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. నగరంలోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. రూ. 117.17 కోట్లతో ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. భారత్ వేదికగా అక్టోబర్–నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రూ. 500 కోట్లతో దేశంలోని కనీసం ఐదు ప్రధాన స్టేడియాల్లో సౌకర్యాలను మెరుగు పరచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ స్టేడియం నిర్వహణను గాలికొదిలేశారు. సౌత్ స్టాండ్‌లోని పైకప్పు (కనోపి) నాలుగేళ్ల కిందట గాలివానకు ధ్వంసమైంది. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ కు పైకప్పులు లేవు. దాంతో, మధ్యాహ్నం మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకులు ఎండకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఉప్పల్‌తో పాటు దేశంలోని పలు స్టేడియాల్లో టాయిలెట్స్, మంచి నీళ్లు, సీటింగ్ వంటి కనీస సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై ఫిర్యాదులు అందడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. వన్డే వరల్డ్ కప్ ముంగిట హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, మొహాలీ, వాంఖడే స్టేడియాలను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు షార్ట్‌లిస్ట్ చేసిన 12 వేదికల్లో మొహాలీ మినహా మిగిలిన నాలుగు స్టేడియాలున్నాయి. పునరుద్ధరణ కోసం ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీకి రూ.100 కోట్లు, ఈడెన్ గార్డెన్స్‌కు 127.47, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి 79.46 కోట్లు, వాంఖడేకు 78.82 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియాన్ని రెండు దశాబ్దాల కిందట దాదాపు రూ. 60 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇప్పుడు పునరుద్ధరణ కోసం 117 కోట్లు కేటాయించిన నేపథ్యంలో స్టేడియం సరికొత్తగా ముస్తాబు కానుంది.