Elon Musk: ట్విట్టర్ సీఈవో బాధ్యతలు చేపట్టిన మస్క్ పెంపుడు శునకం
- సీఈవో సీటులో కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసిన మస్క్
- పాత సీఈవో కన్నా మెరుగ్గా పనిచేస్తుందని సెటైర్
- కంపెనీ బ్రేక్ ఈవెన్ లోకి వచ్చిందని ప్రకటించిన ఎలాన్ మస్క్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ సంచలన మార్పులు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించి సీఈవో బాధ్యతలను మస్క్ చేపట్టారు. అయితే, తనకన్నా మంచి సీఈవో కోసం వెతుకుతున్నట్లు ప్రకటించిన మస్క్.. చివరకు తన పెంపుడు శునకం ఫ్లోకికి ఆ పోస్టు కట్టబెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఫ్లోకి ట్విట్టర్ సీఈవో బాధ్యతలను స్వీకరించిందంటూ మస్క్ ట్వీట్ చేశారు.
ఇకపై ట్విట్టర్ సీఈవో బాధ్యతలను ఫ్లోకి చూసుకుంటుందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన పెంపుడు శునకం ఫ్లోకికి మెడ దగ్గర నల్లగా ఉంటుందని, గొంతు గంభీరంగా ఉంటుందని మస్క్ తెలిపారు. సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. తన ముందు సీఈవో కన్నా ఫ్లోకి బాగా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ ను మస్క్ టేకోవర్ చేశాక అడ్వర్టయిజర్లు కంపెనీకి దూరమయ్యారు. దీంతో కంపెనీ నష్టాలు చవిచూసింది. తాజాగా అడ్వర్టయిజర్లు తిరిగొచ్చారని, ట్విట్టర్ బ్రేక్ ఈవెన్ లోకి వచ్చిందని మస్క్ వెల్లడించారు. మరోవైపు, ట్విట్టర్‌ను ఎక్స్ కార్ప్‌లో విలీనం చేసినట్లు మస్క్ ప్రకటించారు. చైనాలోని వీ చాట్ తరహాలో ఓ సూపర్ యాప్ ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎవ్రిథింగ్ (ఎక్స్) యాప్ పేరుతో తీసుకురానున్నానని ఆయన వివరించారు. ట్విట్టర్ ను టేకోవర్ చేయడం ఈ ప్లాన్ లో భాగమేనని ఎలాన్ మస్క్ గతంలోనే వెల్లడించారు.