Ambedkar: దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్న కేసీఆర్.. విగ్రహం విశేషాలు ఇవిగో!
- హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం
- విగ్రహావిష్కరణకు హాజరవుతున్న అంబేద్కర్ మనవడు
- కార్యక్రమానికి 50 వేల మంది హాజరయ్యే అవకాశం
హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. రేపు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది.
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం గమనార్హం. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 750 బస్సులను వివిధ ప్రాంతాలకు పంపుతోంది. 50 వేల మంది ఆసీనులయ్యేలా విగ్రహం ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు.
ఈ విగ్రహం తయారీకి రూ. 146.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. విగ్రహం కింద ఉన్న పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండు లక్షల మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు.