Harish Rao: అప్పుల్లో అభివృద్ధి సాధించాం.. అదానీని అభివృద్ధి చేశాం.. ఈ విషయం హరీశ్ రావుకు తెలీదా?: సీపీఐ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
- దేశంలో జగన్ కన్నా ఎక్కువ ఆస్తులున్న సీఎం ఎవరున్నారన్న రామకృష్ణ
- కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానని మాట తప్పటం గమనించలేదా అని ప్రశ్న
- అయినా ఏపీలో అభివృద్ధి లేదని హరీశ్ చెప్పటం హాస్యాస్పదమని వ్యాఖ్య
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రులు వరుస పెట్టి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ, జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రాలో అభివృద్ధి లేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీశ్ రావుకు తెలీదా? భారతదేశంలో జగన్‌మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఏపీలోని పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి ఆదానీని అభివృద్ధి చేయటం కనపడలేదా?’’ అంటూ సెటైర్లు వేశారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానన్న జగన్.. తర్వాత మాట తప్పి, మడమ తిప్పటం గమనించలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. ఇన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదని హరీశ్ రావు చెప్పటం హాస్యాస్పదమంటూ వ్యాఖ్యానించారు.