Perni Nani: జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తానని చెప్పగలరా?: చంద్రబాబుకు పేర్ని నాని సవాల్
- బందరులో చంద్రబాబు సభ
- చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అన్న పేర్ని నాని
- కేంద్రం నిధులను దోచేశారని ఆగ్రహం
- జగన్ నమ్మకానికి ప్రతిరూపం అని కితాబు
గతరాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంలో భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సీఎం జగన్ నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, చంద్రబాబు వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం అని విమర్శించారు.
గంజాయికి ఈ రాష్ట్రం చిరునామాగా మారింది... గంజాయిలో సీఎంకు వాటా ఉంది అంటున్నాడు... గంజాయి దందాలో వాటాలు తీసుకునే తప్పుడు అలవాట్లు నీకు ఉన్నాయేమో కానీ, జనం కోసం బతికే జగన్ మోహన్ రెడ్డికి లేవు అని పేర్ని నాని మండిపడ్డారు. "నాడు నీ క్యాబినెట్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావే చెప్పాడు... రాష్ట్రం గంజాయిలో నెంబర్ వన్ గా ఉందని చంద్రబాబు క్యాబినెట్ భేటీలో అంటున్నాడు, కానీ మేం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని గంటా మీడియా ముందు చెప్పాడు" అని వివరించారు.
"వెలగపూడిలో సచివాలయం ఉంటుంది అని అన్నావు... మళ్లీ తాత్కాలికం అన్నావు... ఒక్కటైనా పర్మినెంటుగా కట్టావా? కేంద్రం ఇచ్చిన నిధుల్నీ దోచేశావు. మా బందరులో లడ్డే కాదు, హల్వా కూడా ఫేమస్. మెత్తగా ఉంటుంది... మా ఊరి హల్వాలా నిధులను చంద్రబాబు, నారాయణ దోచేశారు.
జగన్ బటన్ నొక్కి దోచుకుంటారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కానీ, జన్మభూమి కమిటీలకు, పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్లే బటన్ నొక్కుడు మీది. నీరు-చెట్టు ఉన్నప్పుడు ఎంత నొక్కారు మీరు? రూ.2 వేల కోట్లు నొక్కేశారు. పనికి ఆహారంలో కూడా నొక్కేశారు. జన్మభూమి కమిటీల మేతతో విసిగిపోయి కదా జగన్ కు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది.
ఆయన అంటాడు... జగన్ క్యాన్సర్ గడ్డ లాంటి వాడంట... వెంటనే తీసేయాలంట... ఏం, మీకేమైనా వచ్చిందా క్యాన్సర్? రాష్ట్రానికి పట్టిన శని, దౌర్భాగ్యం చంద్రబాబు... ప్రజలు మీ పార్టీని బంగాళాఖాతంలో, బందరు గుండేరు మురికి కాల్వలో కలిపారు కదా. ఇంకా ఏం కలపాలి?
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకు సవాల్ విసురుతున్నా. జగన్ కంటే మీదే మంచి పాలన అని చెబుతున్నారు కదా... మరి 2014 నుంచి 2019 వరకు ఉన్న పాలనను మరోసారి అందిస్తాను, జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తాను అని చెప్పగలరా?" అంటూ ధ్వజమెత్తారు.