rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం!
- తెల్లవారుజామునుంచి పలు ప్రాంతాల్లో గాలివాన
- ఈదురు గాలులతో కూలిన చెట్లు, విద్యుత్ కు అంతరాయం
- ఈ నెల 16 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం
హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, అల్వాల్, బోయిన్ పల్లి, మణికొండ, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మాదాపూర్‌లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొన్నాళ్లుగా ఎండ, పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి వర్షాల వల్ల ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.