Italy: ల్యాబ్ లో తయారు చేసిన మాంసంపై నిషేధం విధించిన ఇటలీ.. ప్రపంచంలోనే తొలి దేశం!
- ఈ తరహా మాంసాన్ని నిషేధించిన తొలి దేశంగా ఇటలీ
- నిబంధనను ఉల్లంఘిస్తే రూ. 53 లక్షల వరకు నిషేధం
- ప్రయోగశాలల్లో తయారయ్యే ఉత్పత్తులు దేశ శ్రేయస్సుకు రక్షణను ఇవ్వవన్న ఇటలీ ప్రధాని
ల్యాబ్ లో తయారైన మాంసాన్ని ఇటలీ నిషేధించింది. తద్వారా ఈ మాంసాన్ని నిషేధించిన తొలి దేశంగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. ల్యాబ్ లో పెరిగిన ఆహారం, ఫీడ్ ఉత్పత్తి, ఫీడ్ వినియోగాన్ని నిషేధించే బిల్లును ఇటలీ ఆమోదించింది. దేశ వ్యవసాయ, ఆహార వారసత్వాన్ని రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలను తీసుకోనుంది. నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ. 53 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ, ప్రయోగశాలల్లో తయారయ్యే ఉత్పత్తులు, వాటి నాణ్యత దేశ శ్రేయస్సు, సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి రక్షణను ఇవ్వలేవని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటాలియన్ ఆహార పరిశ్రమను సాంకేతిక ఆవిష్కరణల నుంచి కాపాడుతుందని చెప్పారు. మరోవైపు వ్యవసాయ మంత్రిత్వ శాఖను వ్యవసాయం మరియు ఆహార సార్వభౌమాధికార మంత్రిత్వ శాఖగా మార్చింది.