Bandi Sanjay: కేసీఆర్ దళిత ద్రోహి.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత ఆయనకు లేదు: బండి సంజయ్
- అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు కేసీఆర్ ఎందుకు రావడం లేదన్న సంజయ్
- ఎన్నికల కోసమే అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
- దేశ విభజనను అంబేద్కర్ వ్యతిరేకించారన్న సంజయ్
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దళిత ద్రోహి అని... బీఆర్ఎస్ పాలనలో దళితులు ప్రతి రోజు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత కేసీఆర్ కు లేదని చెప్పారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు.
త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టే అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా పీవీ నరసింహారావు విషయంలో ఇలానే చేశారని మండిపడ్డారు. హడావుడి అంతా పూర్తయిన తర్వాత పీవీని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370ని, దేశ విభజనను వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని, ఆయనను ఓడించిందని చెప్పారు. దేశ విభజనను అంబేద్కర్ వ్యతిరేకించారని అన్నారు. మోదీ పాలనలో పథకాలు దళితులకు అందుతున్నాయని చెప్పారు.