chan: అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టాం.. దళిత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు

Committed for Dalits welfare says Chandrababu

  • అంబేద్కర్ స్ఫూర్తితో దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చామన్న చంద్రబాబు
  • పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని వ్యాఖ్య
  • ప్రతి పనిని దళితవాడ నుంచి ప్రారంభించే సంప్రదాయాన్ని తెచ్చామన్న బాబు

సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...  అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. అంబేద్కర్ గొప్పదనం భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా ఉన్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ... రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టామని తెలిపారు. 

పేద విద్యార్ధులకు విదేశీ విద్యను అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలు పెట్టే సంప్రదాయాన్ని తెచ్చామని అన్నారు. ఇకముందు కూడా అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News